Sunday, March 28, 2010

తెలుగు దినపత్రికలు అమ్ముకున్న వార్తలు లేదాPaidNews

అధికార పక్షం యొక్క అవినీతి,బంధుప్రీతి,ఆశ్రితపక్షపాతం,నిర్లక్ష్యం,ఉదాసీనత లేదా ప... thumbnail 1 summaryఅధికార పక్షం యొక్క అవినీతి,బంధుప్రీతి,ఆశ్రితపక్షపాతం,నిర్లక్ష్యం,ఉదాసీనత
లేదా
ప్రతిపక్షం యెంతపనికిమాలిందో
తెలుసుకోవాలంటే యెక్కడికెళ్ళాలి?
యెక్కడికీ వెళ్ళక్కర్లేదు.సుబ్బరంగా ఇంట్లో కూర్చుని నాలుగుపత్రికలు తిరగేస్తేచాలు,బోలెడు సమాచారం.అవిమీరు నమ్ముతారా మీ దురదృష్టం,నమ్మరా మీ ఖర్మ మరి.
మరా నాలుగో,ఆరో,తొమ్మిదో పత్రికలు యేమిచేస్తున్నాయి అని తెలుసుకోవాలనుకుంటే మార్గం??
పెద్దగా యేమీలేవు.యేవో కొన్ని వెబ్ సైట్లు,మరికొన్ని బ్లాగులు.అక్కడా కొన్ని సార్లు సమాచారం మొత్తం దొరకదు కదా మరేది దారి?
ఊహాగానం.అంతే.
పోయినేడాది అటు లోక్ సభకూ,ఇటు రాష్ట్ర శాసనసభకూ ఎన్నికలు జరిగాయి.బాహాబాహి,కచాకచి అన్నట్టు పోరు రసవత్తరంగా సాగింది.ఫలితాలూ వచ్చాయి.ప్రభుత్వాలూ యేర్పడ్డాయి.ఈలోపు జరిగిందో చిత్రం.కొన్ని తెలుగు దినపత్రికలు రాజకీయపార్టీల దగ్గర డబ్బులుపుచ్చుకుని,వార్తల్లా కనిపించే ప్రకటనలను పాఠకులమొహాన కొట్టాయీ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.అటు జాతీయ స్థాయిలోనూ తీవ్రమైన చర్చలే జరిగాయి. కొన్ని సంఘాలు,సంస్థలూ విచారణలూ,పరిశోధనలూ జరిపాయి.నివేదికలు సమర్పించాయి,సమర్పిస్తున్నాయి.అటువైపు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియావారు కూడా లేస్తే మనిషిని కాదన్న ప్రకటనలు కాస్త ఘాట్టిగానే ఇస్తున్నారు.సంతోషం.
మన రాష్ట్ర్రానికొస్తే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వారు ఒక నివేదికను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియావారికి సమర్పించారు.మనలో మనమాట ఈ మధ్య కాలంలో ఈ యూనియన్ వారు చేసిన ఒకేఒకమంచిపని ఇదని ఎవరన్నా గొణిగినా మనమేమీ పట్టించుకోనక్కర్లేదు.
ఈ నివేదికలో ప్రముఖతెలుగుదినపత్రికలైన,ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి,సూర్య,ఆంధ్రభూమి,వార్త పత్రికలవారు యెన్ని అంగుళాలచొప్పున ఎన్ని ప్రకటనలు వార్తల్లా ఇచ్చారు,యేయే నియోజకవర్గాల్లో యేయే రాజకీయపార్టీలకు భజనచేశారు,యేనియోజకవర్గాల్లో ఒకరోజు కాంగ్రెస్ గెలుస్తుందనీ,మరుసటి రోజు అబ్బెబ్బె తెలుగుదేశం గెలుస్తుందని డాంబికాలు పలికారో వివరంగా వర్ణించారు.
ఇదంతా చూసి,చదివి మన తెలుగుపత్రికలు ఊరందరికీ శకునం చెప్పే బల్లి కుడితితొట్లో పడ్దట్టు అంటారో,
లేక ఉల్లిపాయవండొద్దన్నది ఊళ్ళో వాళ్ళకి గానీ మన యింట్లో వంటక్కాదన్న హరిదాసుగారు గుర్తుకొస్తారో అది మీరే తేల్చుకోవాలి.
ఆనివేదిక/లను ఇక్కడ చదివి మీ అభిప్రాయాలు రాయండి.వాళ్ళకుపంపుదాం.

ఇక్కడచదవండి

1 comment

శివ said...

ఎప్పుడైతే 1975 లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కొన్ని పత్రికలూ ప్రభుత్వానికి వంత పాడటం మొదలుపెట్టాయో, అప్పుడే జర్నలిస్టుల విలువ పడిపోయింది. పాలక పక్షం డబ్బా కొట్టి కొట్టి రాజ్యసభ సభ్యులు అవ్వటం, లేదా ఏదేదో పదవులు సంపాయించటం మొదలు పెట్టారు. డబ్బుచ్చుకుని వార్తలు వేస్తున్నారు అనటంలో ఆశ్చర్యమేమీ లేదు. చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. కాని ఎందుకు చదువుతాం అంటే, ఆ డబ్బులిచ్చి వాళ్ళు ఏమి వ్రాయించుకున్నారో చూద్దామని. టి వి చానెళ్ళు, పత్రికలూ అన్నీ కూడా ఏదో ఒక కొమ్ము కాస్తున్నవే. నిస్పక్షపాతమైన జర్నలిజం నశింఛిపోయింది. True Journalist if any, is in endangered species category, if not perished altogether.