Sunday, November 20, 2016

‘చూపు తిప్పుకోలేనంత ప్రేమ పుట్టింది నీ పైన'-----అంజని యలమంచిలి

ఆయన జన్మించి 809 సంవత్సరాలు ఆయన మృతిచెంది 743 సంవత్సరాలు ఆయన జీవించినది 66 సంవత్సరాలు ఆయన రచించినది 26000 ద్విపదాలు ఆయన రచించినవి 4... thumbnail 1 summary

ఆయన జన్మించి 809 సంవత్సరాలు
ఆయన మృతిచెంది 743 సంవత్సరాలు
ఆయన జీవించినది 66 సంవత్సరాలు
ఆయన రచించినది 26000 ద్విపదాలు
ఆయన రచించినవి 40000 ప్రేమకవితలు
‘ఈ కవిత్వం… నేను ఏమిటి చెప్పబోతానో నాకే తెలీదు.
నేను ముందుగా ఏదీ అనుకోను.
నేను ఏదీ చెప్పకుండా ఉన్నప్పుడు, నేను ప్రశాంతంగా ఉండి, మాటే మాటాడను’ అంటాడు.
గట్టిగా మాట్లాడితే...
‘నీ ప్రేమ నన్ను వెంటాడింది, నా సహనం నను వీడి పోయింది,
నా మేధ పడకేసింది, నా మనసును దొంగిలించావ్ !’ అంటూ నిష్టూరమాడతాడు.
అలాకాదని కాస్త చనువిస్తే...
‘చూపు తిప్పుకోలేనంత ప్రేమ పుట్టింది నీ పైన,
నా జీవితం, హృదయం పిండి పోశా నీ లోన !’ అంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తాడు.
అయ్యో... ఇదేమిటిలా అంటే..
‘నీకేం కావాలో దోచేసుకో, నీ దెబ్బ కాచగలేను,
పోగొట్టుకుంటున్న ఈ హృదయాన్ని మరెక్కడని దాచగలను?’అని ఎదురు ప్రశ్నిస్తాడు.
ఆయనే... మనందరికీ తెలిసిన రూమీ (జలాలుద్దీన్ ముహమ్మద్ రూమీ).
భగవంతుడ్ని నీకు నిజంగా చూడడం వస్తే...
ఎక్కడోలేడు.. నీలోనే వున్నాడని మతవిశ్వాసాల ఢాంబికతను బట్టబయలు చేశాడు.
‘‘భగవంతునికై క్రైస్తవులలో, శిలువపైన వెతికాను.
కానీ ఆయన నాకు కనబడలేదు.
నేను విగ్రహారాధన చేసే పురాతన దేవాలయాలలోకి వెళ్లాను.
అక్కడా ఆయన కనబడలేదు.
నేను హిరాలోవున్న పర్వత గుహలలోకి,కాందహార్ వరకూ వెళ్లాను.
కానీ.. ఆయన నాకు అక్కడా కనబడలేదు.
ముందుంచబడిన ఒక పనిపై నేను కాకసన్ పర్వతాలపైకి కూడా వెళ్లాను.
అక్కడ అంకాలు నివసించడం మాత్రమే చూశాను.
అప్పుడు నా అన్వేషణని యువ వృద్ధుల మకామైన కాబావైపు మళ్లించాను.
అక్కడా దేవుడు లేడు.
తత్వంవైపు మళ్లి, ఇబిన్ సినా ని దేవుని గురించి అడినాను.
అతని పరిధిలోనూ లేడు.
మహమ్మదు ప్రవక్త యొక్క ‘రెండు ధనువుల దూరంలో ఉన్న దివ్యమైన అనుభూతి’
గురించి విని ఆయన కచేరికీ వెళ్లాను.
అక్కడ కూడా ఆయన ఆచూకీ లభించలేదు.
చివరికి నేను నా హృదయంలోకి తొంగి చూశాను.
ఆయన అక్కడ కనిపించాడు....’’ అని చెపుతాడు రూమీ.

***
13వ శతాబ్దానికి చెందిన పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త మరియు సూఫీ.
ఆఫ్షనిస్తాన్ లోని బల్ఖ్ ప్రాంతంలో 1207, సెప్టెంబరు 30న జన్మించిన రూమీ...
బైజాంటియన్ సామ్రాజ్యంలోని రోమన్ ప్రాంతమైన రూమ్ లో తన జీవితకాలం ఎక్కువగా గడిపాడు.
కాబట్టే ఇతనికి రూమి అనే పేరు వచ్చిందని చెబుతారు.
ఇతను తజకిస్థాన్ లోని వఖ్ష్ ప్రాంతంలో జన్మించాడనే వాదమూ ఉంది.
‘మనం మరణించిన తర్వాత మన సమాధిని భూమిలోకాక
జనుల గుండెలలో చూసుకోవాలి’ అని చెప్పుకున్న రూమీ... రూమి
1273, డిసెంబరు 17న కోన్యాలో మృతి చెందాడు.
***
లయాత్మక తాత్విక కవిత్వం రూమీ సొంతం
పర్షియన్ కవిత్వం, సూఫీ తత్వం, సూఫీ నృత్యం ఆయన తత్వం
ఆయన రాసిన వేలాది కవితా పంక్తులలో అద్భుతమైనది ప్రేమ కవిత్వం
ఆయన చనిపోయి ఏడున్నర శతాబ్దాలు కావొస్తున్నా..
ఆయన కవిత్వం అజరామరంగా నిలిచిపోయింది.
ప్రేమకు... అక్షరాలకు చావులేదని నిరూపించిన రూమీకి
  ఘననివాళులు.

No comments