Saturday, December 3, 2016

‘అసమర్ధుని జీవయాత్ర’ .... నా స్పందన--అంజని యలమంచిలి

కదులుతున్న కాలంతో అడుగు కలపలేక... అలాగని స్తబ్ధుగా వుండలేక... జరుగుతున్న వాటిని ఓ కంట కనిపెడుతూనే... అంతరించిపోతున్న విలువను కాపాడుకోలేక.... thumbnail 1 summaryకదులుతున్న కాలంతో అడుగు కలపలేక... అలాగని స్తబ్ధుగా వుండలేక...
జరుగుతున్న వాటిని ఓ కంట కనిపెడుతూనే...
అంతరించిపోతున్న విలువను కాపాడుకోలేక... అలాగని ప్రేక్షక పాత్ర వహించలేక...
కష్టనష్టాలు మనుషులకేనని తలుస్తూ... జీవిత పందెంలో గెలవలేక...
దొరికినంతవరకే మనదని సరిపెట్టుకొని.. అందని దానికోసం సాహసం చేయలేక...
నొసట గీతల ప్రకారమే జరుగుతుందనే భావనలో... చేయిచాచి అందుకోలేక
ఒడిదుడుకుల ఒడిలో సాగిపోతూ... బడలికల నీడలో సేదతీరుతూ..
అనుబంధాలను బంధించే బంధాలు... సంకెళ్లని...
కాలగమనాన్ని కనలేక... గెలవలేక... రాజీపడలేక...
ఆత్మన్యూనతా భావంతో మగ్గిపోయే అసమర్ధుడు... సీతారామారావు.
మీ ఊహ నిజమే.... నేను చెబుతోంది త్రిపురనేని గోపీచంద్ ‘అసమర్ధుని జీవయాత్ర’ గురించే....
ఈ నవలను చదువుతుంటే....
ఏదో కథ చదువున్నట్టుగా కాకుండా... ఓ మనిషి అంతరంగాన్ని చదువున్న భావన కలుగుతుంది.
సీతారామారావు పాత్రలో కనిపించే ఆధిక్యతా, ఆత్మన్యూనతా భావాలు
పఠితులనూ ఒకింత చికాకు, వేదనకు గురిచేస్తాయి.
***
జగమెరిగిన ఈ అసమర్ధుని గురించి ఇప్పటికే ఎందరో మహామహులు సమీక్షించేశారు.
కానీ.... జీవితం ఎప్పుడూ కొత్తగానే వుంటుంది. ఎన్నో మలుపులు... ఒడిదుడుకులూ వుంటాయి...
అందుకేనేమో అదెప్పుడూ కొత్తగానూ... వింతగానూ, తియ్యగానూ... చేదుగాను వుంటుంది.
అందుకే నేనూ ఓ నాలుగు ముక్కలు రాయడానికి సాహసించా....
జమీందారీ వ్యవస్థ బీటలు వారుతున్న వైనాన్ని..
పెట్టుబడిదారీ సమాజం బీజాలు నాటుకుంటున్న తీరును....
ఈ నవలలో గొప్పగా విశ్లేషిస్తాడు గోపీచంద్‌.
మన పల్లెటూళ్లు... మానవ సంబంధాలు... ఈర్ష్యా ద్వేషాలూ...
అన్నీ తమ తమ వికృత రూపాలను మనకు సాక్షాత్కరింపజేస్తాయి.
ఈ నవల ఒక తరం జీవితాన్ని కళ్లకు కడుతుంది.
అందుకే... ఈ తరం వారికీ జీవితంలోని ఎత్తుపల్లాలకు సాదృశ్యంగా నిలబడింది.
ఈ నవలలోని నాయకుడు సీతారామారావు ధీరోదాత్తుడేం కాదు... అంతర్ముఖుడు.
గోరంతను కొండంతలుగా ఊహిస్తాడు...
పరిసరాలతో సంబంధం లేకుండా ఊహాలోకాల్లో తేలిపోతుంటాడు.
ఇతడు ఊహాశాలి... ఉన్మత్తుడు. ఇందుకు సంబంధించిన అనేక దాఖలాలు నవల ఆసాంతం కనిపిస్తాయి.
విభిన్న సామాజిక దార్శనికతల మధ్య ఘర్షణ సహజమనీ...
ఆ ఘర్షణను ప్రగతిశీల దృక్పథంతో అర్థం చేసుకోవాలనీ...
అలా చేయలేకపోతే... ఇలాంటి సీతారామారావులు అనేకమంది
ఈ సమాజంలో తయారవుతారని గోపీచంద్ హెచ్చరిస్తాడు.
అందుకే ఈ నవలకు ఒక విశిష్టత ఏర్పడింది.
సీతారామారావు తండ్రి చావు మంచం మీద వుండి...
‘బాబూ... మన వంశం పేరు నిలబెట్టు’ అని కన్నుమూస్తాడు.
అక్కడినుంచి మొదలవుతుంది సీతారామారావు జీవన యాత్ర.
మిగతావారికంటే తాను అతీతమైన వ్యక్తినను కోవడం ఇతని స్వభావం.
ఆస్తి మొత్తం కరిగిపోతుంది.... మామూలు జీవితంలో రాజీ పడలేకపోతాడు.
ఉదయాన్నే లేస్తే... భార్య అదికావాలీ, ఇదికావాలీ అని అడుగుతుందని బారెడు పొద్దెక్కే వరకు లేవడు.
సమస్యలనుంచి తప్పించుకుపారిపోవడానికి చూస్తాడు...
ఎవరూ లెక్కచేయడంలేదని... అందరూ మోసం చేస్తున్నారని మదనపడతాడు...
అసమర్ధుడిగా మిగిలిపోతాడు.
అందుకే... సీతారామారావు పాత్ర విచ్ఛిన్నమౌతున్న వ్యక్తిత్వానికి ప్రతీకగా నిల్చిపోయింది.
***
తెలుగు నవలా సాహిత్యంలో గోపీచంద్ కు సుస్థిర స్థానాన్ని సంపాదించిపెట్టిన నవల ఇది.
తెలుగు సాహిత్యంలో చెక్కు చెదరని స్థానం దీనిది.
తెలుగులో మొట్టమొదటి మనో వైజ్ఞానిక నవల కూడా ఇదే.
దీన్ని త్రిపురనేని గోపీచంద్ 1945-46లో రాశారు. ఇది ఆయన రెండవ నవల.
మనోవిశ్లేషణాత్మకతను ప్రధాన ఇతివృతంగా చేసుకుని రచించిన నవలల్లో ‘అసమర్ధుని జీవయాత్ర’ ఒకటి.
ఆయన ఎన్నుకున్న ఇతివృత్తం, శిల్పం, పాత్రల మనస్తత్వం... వాటి మధ్య జరిగే నాటకీయత... ముగింపు...
ఇవన్నీ గోపీచంద్ ప్రతిభను, సృజనాత్మకతను చాటిచెబుతాయి.

No comments