Friday, December 23, 2016

అల్లూరి గౌరీ లక్ష్మి కవిత్వం ---గణేశ్వర రావు

కవిత్వం మీద అల్లూరి గౌరీ లక్ష్మి కి ఎంత మమకారమే ఆమె మాటల్లోనే తెలుసుకుందాం: 'జీవితాన్ని సూటిగా అల్పాక్షరాలలో ఆవిష్కరించి,గురువులా గమ... thumbnail 1 summary

కవిత్వం మీద అల్లూరి గౌరీ లక్ష్మి కి ఎంత మమకారమే ఆమె మాటల్లోనే తెలుసుకుందాం: 'జీవితాన్ని సూటిగా అల్పాక్షరాలలో ఆవిష్కరించి,గురువులా గమ్యం చూపి, ఆత్మీయ ఆలింగనమిచ్చే కవిత్వం అంటే నాకు ఆరాధన.' నిన్న హైదరాబాద్ పుస్తక మేళా లో ఆమె 'నీరెండ దీపాలు' ఆవిష్కరణ సభ జరిగింది. సభలో పాల్గొన్న వారందరూ ఆమె కవితాత్మను ఆవిష్కరించారు. వివిధ విషయాలమీద 50 కవితలు ఉన్నాయి. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మచ్చుకు 'సాధికారిణి ' గురించి రెండు మాటలు చెప్పే ముందు, అందులోని కొన్ని పంక్తులని చూడండి: 'గౌన్లు వేసుకున్న బాల్యంలో/వంశాన్ని నిలబెట్టిన దీపాన్నీ అని అన్నారు/ చదువే ధ్యానంగా సైకిలెక్కి కాలేజీ కి వెళ్ళినప్పుడు/ కష్టపడలేవు సుమసుకుమారివి అన్నారు/ఆడపిల్ల మెట్టినింట మెరవాలన్నారు... అన్నను మించిపోయి చదువుకున్నందుకు /ఉద్యోగినై నాన్నలా సంపాదించి ఇచ్చినప్పుడు / నడిచివొచ్చిన లక్ష్మీ సరస్వతి నయ్యాను/ ఇంటికి దీపంలా నిలబడ్డ హారతి నయ్యాను. సెలవు దినాన ఇంటి కూలీగా మారి / వారం దినాల్లో చిరునవ్వుల ఇస్త్రీ చీరై ..ను అయ్యాను .. చూలింత, బాలింతనాల అపురూపాల్ని మరిచి/పాపాయి సుతిమెత్తని హత్తుళ్ళ నొదిలి.. ఎండా వానల్లో, ఇంటికీ / ఆఫీసుకీ చక్రాల పరుగౌతూ.. అధిక శ్రమతో తిరిగిన శరీరపు కొవ్వొత్తినై / శక్తి చమురుగా వెలిగించిన దీపాన్నీ అయ్యాను. ' స్త్రీ వాదం లోని ఆధునిక కోణం ఇది. '84 లో సావిత్రి 'పాఠం ఒప్పచెప్పక పొతే / పెళ్లి చేస్తానని పంతులు గారు..ఆఫీసులో నా మొగుడున్నాడు అని అన్నయ్య అన్నప్పుడు / వాడికేం మహారాజని / ఆడామగా వాగినప్పుడే అర్థమై పోయింది - పెళ్ళంటే పెద్ద శిక్షని ..' అని స్త్రీ పురుష అసమానత్వం గురించి రాసిన కవిత గుర్తు రాక మానదు. 'అమ్మకి ఆదివారం లేదా?' అన్న కథ గుర్తుకొస్తుంది. గౌరీ లక్ష్మి కవితలో 'కొవ్వొత్తి' భావ చిత్రం బాగా కుదిరింది. స్త్రీల అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది 'లింగభేదం మెరుగని స్వప్న సమాజ సాకారానికి/ అలుపెరుగక మరో మెట్టెక్కటమే' స్త్రీ లక్ష్యం అని తనకు తాను చెప్పుకుంటుంది. ఆలోచనాత్మకమైన కవితలు రాసిన అల్లూరి వారిని అభినందించకుండా ఉండలేము.

No comments