Thursday, December 22, 2016

ఆముక్తమాల్యదపై ఒక సామాన్యుడి సమీక్ష.-- మూడవ భాగం ----మల్లారెడ్డి దేశిరెడ్డి

  విష్ణుచిత్తుడు మధుర ప్రయాణం :: ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ మధురయు మరియు మథుర రెండు వేర్వేరు. దక్షిణ భారతదేశములో పాండ్యరాజుల రాజ్య రాజధాని మ... thumbnail 1 summary
 


విష్ణుచిత్తుడు మధుర ప్రయాణం ::
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

మధురయు మరియు మథుర రెండు వేర్వేరు.
దక్షిణ భారతదేశములో పాండ్యరాజుల రాజ్య రాజధాని మధుర చతుర్ధ ధకారము.ఇకపోతే ఉత్తర భారతదేశములో శ్రీకృష్ణుని జన్మస్థలం మథుర ద్వితీయ ధకారము. ప్రదేశం ప్రస్తావన క్రింది పద్యంలో చూడండి.

కపివర నియుక్త గిరిసదృ గ్గహననిలయ

గాత్రగాహిత కనకముక్తాకవాట

గోపురా వేదితోచ్చతాక్షోభ్యవవ్ర

దనరు దక్షిణ మధుర సాంద్ర ద్రుమ ధుర.

ద్వితీయాశ్వాసము-3. [ 8 వ పద్యం ]

ఇక విలిబుత్తూర్లో విష్ణుచిత్తుడు ఎప్పటివలెనే  తులసి మాలను మన్ననారు స్వామి వారికి సమర్పించబోయేంతలో ఆ స్వామియే అచట ప్రత్యక్షమయేడు!స్వామి చిరునవ్వుతో రాజైన మత్స్యధ్వజుడి పరిస్థితి వివరించేడు. నువ్వు వెంటనే మధురకి వెళ్ళు, అచట పాండ్యరాజ్య కొలువు నందు నీవు వాదనలు చేసి,విజయం సాధించి , రాజు వారిచ్చే బంగారు నాణెముల బహుమతిని పొందమని చెప్పి, అంతయేగాక అక్కడ రాజునకు వైరాగ్యం కలిగినది,రాజును
వైష్ణవ భక్తునిగా మార్చమని చెప్పగా అంతట
విష్ణుచిత్తుడు గడ గడ వణికి , నాకు చదువు రాదు, సంధ్య రాదు,  శాస్త్రగ్రంథాల వంకనైనా చూడని వాడని, నేను దేవాలయపు తోటలో త్రోవ్వుగోలతో మట్టి త్రవ్వి చేతులు కాయలు కాయుంచు కొన్నవాడను,ఆ రాజ కొలువులో నేను వాదించెడిదేమిటి?నేను గెలిచెడిదేమిటి,
నీకు అప్రతిష్ట స్వామి, అనినట్లుగా ఈ క్రింది పద్యములో చెప్పబడెను.

"స్వామి, నన్ను , నితఃపురాపఠితశాస్త్ర గ్రంథజాత్యంధు, నా

రామక్ష్మా ఖననక్రియాఖర ఖనిత్రగ్రాహితోద్కత్కిణ

స్తోమాస్నిగ్ధకరు , న్భవద్భవనదాసు,న్వాదిఁ  గాఁ బంపుచో

భూమీభృత్సభ నోట యైన నయశంబు ల్మీకు రాకుండునే ? "

ద్వితీయాశ్వాసము - 90. [ 9 వ పద్యం ]

స్వామీ ఇది యిల్లూడ్చుటయా, నీళ్లను తోడి తెచ్చుటయా,నీ పల్లకిని మోయుటయా,నాకు  నీ వాదమెందుకు,ఐన యింకెవరూ దొరకలేదా నీకునని ప్రాధేయపడ్డాడు.అయితేనేం చివరికి మధుర వెళ్ళుటకు ఎలాగోలా ఒప్పుకున్నాడు
విష్ణుచిత్తుడు.

మధుర వెళ్లి,కొలువు లోపలికి వెళ్ళేడు.అతని దివ్యతేజం చూసి రాజుగారితో సహా సభంతా జంకుతో లేచి నిలబడింది. రాజు చూపించిన బంగారు ఆసనం మీద కూర్చున్నాడు.అప్పటి వరుకు వాదం సాగిస్తోన్న సభంతా నిశ్శబ్దంగా వుండిపోయింది.విష్ణుచిత్తుడు ఆనాటి రాజు కొలువులో,నాటి కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడిలా క్రీడించినట్లు క్రీడించినాడు, ఒక విద్వాంసుడిని పిలిచి అతని వాదం అంతా ముందు తన మాటల్లో వివరించి ,దానిలో ఒక్కొక్క విశేషమును తీసుకుని సూక్ష్మంగా భేదించి ,తన సిద్ధాంతంను స్థాపించి అతనిని ఒప్పించి ఓడించినాడు. ఇలా విష్ణుచిత్తుడు అందరిని వరసగా వాదంలో ఓడించి ,వారికి బ్రహ్మసూత్రాలు,ఉపనిషత్తులని వినిపించి,ఇక వాటి ద్వారా పరమాత్మ తత్వాన్ని నిరూపించి, ఆలా నారాయణుడే పరమాత్మ తత్వమని వారికి బోధించాడు.సకల భూతాల్లోనూ ఉండే ఆత్మ మహావిష్ణువే అని వివరించాడు. ఇంక విష్ణువుని ఎందుకు ఆరాధించాలో తెలియ చేయుటకు ఖాండిక్య కేశిధ్వజుల కథని,దాని  యజ్ఞఫలము గురించి పూర్తి విశ్లేషణను చేసి, పాండ్యరాజు మత్స్యధ్వజుడికి మహావిష్ణువు మహత్యం వివరించాడు విష్ణుచిత్తుడు. ఆలా చివరికి రాజుకు మూలమంత్రాన్ని ఉపదేశించి అతన్ని వైష్ణవ భక్తునిగా మార్చివేసినాడు.

విష్ణు సాక్షాత్కారం ::
◆◆◆◆◆◆◆◆◆◆

పాండ్యరాజైన మత్స్యధ్వజుడు విష్ణుచిత్తుడి విజయానికి అతడిని గజారోహణం చేయించి విష్ణుచిత్తుణ్ణి ఊరేగించినాడు. విష్ణుచిత్తుడిని విబుదులు,[దేవతలు] సిద్ధులు,విద్యాధరులు, కవ్యాహారులు,[పితృదేవతలు] కిన్నరులు బహువిధాలుగా మెచ్చుకొనిరి,క్రింది పద్యంలో ఇలా చెప్పెను.

అద్ధా వాగ్విబుధం, బహో వచన కవ్యాహార, మాహా వచ

స్సిద్ధం,బాః కృతతాం గతః కలి రితి శ్రీసూక్తి విద్యాధరం,

బిద్ధౌద్ధత్యమగా ల్లయం హి కుధియా మిత్థంవద త్కిన్నరం,

బద్ధీరాగ్రణి గెల్పుటుత్సవమునం దయ్యె
న్నభం బంతయున్‌.

పద్యం మొత్తం సంస్కృతం భాష.

చతుర్ధాశ్వాసము - 6. [ 10 వ పద్యం ]

విష్ణుచిత్తుడు గెలిచినప్పుడు దేవలోకాల్లోని వారు విష్ణుచిత్తుడిని పొగిడిన పై పద్య అర్ధం.

విబుధులు (దేవతలు) అద్ధా అన్నారట. కవ్యాహారులు (పితరులు) అహో అన్నారట. సిద్ధులు ఆహా అన్నారట.
విద్యాధరులు కలియుగం కృత యుగమైనది  కదా అనే శ్రీసూక్తి పలికిరట.
కిన్నరులు బిగ్గరగా ఇతర మతాల వాళ్ళకి గర్వం అణిగింది కదా అన్నారట.

విష్ణువు ఆచటి వాళ్ళందరికీ గరుడారూఢుడై దర్శనమిచ్చెను, మహామునులు కూడా వచ్చి సామగానాలు చేశారు.దేవతలు పుష్పవృష్టిని కురిపించారు.విష్ణుచిత్తుడు భక్తిపారవశ్యంతో శ్రీహరిని స్తుతించేడు.ఇక విష్ణువు విశ్వకర్మని పిలిచి విష్ణుచిత్తుడి ఇంటిని మణిమయంగా చెయ్యమని ఆజ్ఞాపించాడు విష్ణువు. ఇంక
విలిబుత్తూరులో ప్రజలు చాలా అద్భుతమైన స్వాగతం చెప్పారు విష్ణుచిత్తుడికి.అంతటి నుండి విష్ణుమహిమకి పరవశించినటువంటి విష్ణుచిత్తుడు భక్తుల్ని చాలా బాగా ఆదరిస్తూ గడుపుతున్నాడతను.


                                                    [సశేషం]

No comments