Thursday, December 22, 2016

దిగులు అనే మానసికవ్యాధి--జి.వి.పూర్ణచంద్

మనసు ఆందోళనగానూ దిగులుగానూ ఉండే సందర్భాలు అందరికీ అనుభవంలోని విషయమే! ఏదో తెలియని ఆందోళనకర అంశం మనసు లోపల కలిగించే అలజడి అది. ఇది మానవ సహ... thumbnail 1 summary

మనసు ఆందోళనగానూ దిగులుగానూ ఉండే సందర్భాలు అందరికీ అనుభవంలోని విషయమే! ఏదో తెలియని ఆందోళనకర అంశం మనసు లోపల కలిగించే అలజడి అది. ఇది మానవ సహజమైన భావోద్వేగం(emotion). దీన్ని డిప్రెషన్, టెన్షన్, మానసిక వ్యాధి ఇలా అనాల్సిన అవసరం లేదు. ఆ మాత్రం స్పందన లేకపోతే మనిషికీ గొడ్డుకీ తేడా ఉండదు కదా! మనసులో బాధపడటం, ఇతరుల కోసమో, తన కోసమో కొంత దిగులు పడటం అనేవి సహజ ప్రవృత్తులు.
ఎవరో కుర్రాడు లారీ క్రిందపడ్డాడు...అనే వార్త తెలిసినప్పుడు మనిషన్న ప్రతివాడూ “అయ్యో! ఏ తల్లి కన్నబిడ్డో” అనుకుంటాడు. అనుకోవాలి కూడా! అది మనిషి మనిషయ్యాడనటానికి గుర్తు. ఒక విషాదకర సందర్భంలో మనసు ఒకింత ఆందోళన చెందటాన్ని సిట్యుయేషనల్ డిప్రెషన్ అంటారు. కానీ, ఆ వార్త విని ఓ వారం రోజులపాటు అన్నపానాలు మానేసి దిగుల్లో కూరుకుపోయే తత్త్వం ఉన్నప్పుడు అది ఖచ్చితంగా వైద్యపరమైన అంశం అవుతుంది. దీన్ని క్లినికల్ డిప్రెషన్ అంటారు.
రూపాయి కష్టానికి అర్ధరూపాయి నుండీ రూపాయి దాకా బాధపడేవాడికి ఏ బాధలూ ఉండవు. కానీ, రూపాయి కష్టానికి వంద రూపాయలు బాధపడటమే క్లినికల్ డిప్రెషన్‘కు కారణం అవుతుంది.
బాధకలిగే సన్నివేశం వచ్చినప్పుడు బాధపడటమే మంచిది. బాధపడితేనే ఆ ఆందోళనలోంచి బయట పడటం సాధ్యం అవుతుంది. అలా బయటకు రాలేకపోయిన వ్యక్తులు చికిత్స అవసరం అయ్యే డిప్రెషను (clinical depression) లోకి వెళ్ళే ప్రమాదం ఉంది.
సకారణంగా వచ్చే ఆందోళన (సిట్య్యేషనల్ డిజార్డర్)ని adjustment disorder అని కూడా పిలుస్తారు. ఆందోళనతో కూడుకున్న మానసిక స్థితి (depressed mood) అనేది స్వక్ల్ప కాలికం. కొద్ది ద్సేపు అయ్యాక మనసు ఆ మూడ్ లోంచి బయటకు వచ్చేస్తుంది. ఆత్మీయుడైన ఒక వ్యక్ల్తి మరణించాడనుకోండి...ఎన్నాళ్ళు ఏడుస్తారు...? నెమ్మదిగా ఒక్కొక్కరే ఆ విషాదం లోంచి బయటపడుతూ వస్తారు. మొదటి రోజు శవాన్ని లేపేప్పుడు ఉన్న విషాదం పన్నెండో రోజున ఉండదు. మానసిక ఆరోగ్య సంపన్నుడు ఇలా విషాదం లోంచి బయట పడగలుగుతాడు. చావులే కాదు, అనేకరకాల నష్టాలు, ఉద్యోగం పోవటం, విడాకుల్లాంటి అంశాలు ఇలాంటివే! మనసు కుడుటపరచుకో...మనో ధైర్యం కూడగట్టుకో...ఇంక అందు లోంచి బయటకురా! జరగవలసిందేమిటో చూడూ...ఇలా పలకరించి సానుభూతి చూపించి, ధైర్యం నూరిపోస్తాం. సకారణ మానసిక ఆందోళనకు అదే ఇతరులు ఇవ్వగలిగిన మందు కూడా! మారిన ఆ పరిస్థితులకు అనుగుణంగా నష్టపోయిన వ్యక్తి లేదా బాధితుడు కూడా మారిపో గలిగితే విషాదం లోంచి బయటకు (రికవరీ) రాగలుగుతారు. అలా బయటకు వచ్చే వరకూ బాధితుడి దైనందిన జీవన అంశాలన్నీ కుంటినడకే నడుస్తాయి. ఎన్నాళ్ళయినా అలా బయటకు రాలేకపోయిన వ్యక్తులు చికిత్సాపరమైన డిప్రెషనుకు లోనై, తమ కెరీరుని దెబ్బతీసుకునే ప్రమాదం ఉంది.
చింత శోకం అనీ రెండు రకాల విషాదాలున్నాయి. ఆత్మీయుల మరణం వలన కలిగే విచారాన్ని శోకం (మౌర్నింగ్) అంటారు. తీరని నష్టం కలిగించే ఇతర సన్నివేశాల వలన కలిగే దుఃఖాన్ని చింత(మెలాంఖోలీ) అంటారు.
కోపం, ఏ పనీ చేయబుద్ధి కాకపోవటం, శ్రద్ధపెట్టలేకపోవటం, నిరాశ, నిస్పృహ, నిద్ర పట్టకపోవటం, ఏదో తెలీని భయం, గుబులు, పెద్దగా ఏడ్చేయా లనిపించటం, ఎవరితోనూ కలవబుద్ధి కాకపోవటం, ఆత్మహత్య చేసుకోవాలనిపించటం ... బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి లక్షణాలు సహజంగా ఉంటాయి. ఇవి తగు మోతాదులో స్వల్పకాలం ఉండేవే! అవి దీర్ఘకాలం కొనసాగినప్పుడు, మితిమీరి ఉన్నప్పుడూ చికిత్స అవసరమయ్యే డిప్రెషనుకు లోనైనట్టు లెక్క! 90 రోజులు దాటి అలాంటి స్థితి నడిస్తే, వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
సాధారణంగా వ్యక్తులు తనకు డిప్రెషన్ ఉందనీ, తగ్గించమని చికిత్స కోసం వచ్చే వాళ్ళు అరుదు. వాళ్ళు బాధే సౌఖ్యమనే ఒక భావనలో కూరుకుపోయి ఉంటారు. సమీప బంధువులు, మిత్రులే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. .
చికిత్స వసరమయే డిప్రెషన్(మూడ్ డిజార్డర్)లో చింతా శోక భయ దుఃఖాదుల్లో మునిగిపోవటం ప్రధానంగా కనిపిస్తుంది. వాటిలోంచి వీళ్ళను బయటకు లాగటం అనేది సమస్యే! ఉపశమన వాక్కులు వీళ్ళమీద పనిచేసే స్థితి లేనప్పుడు వైద్యుని సంప్రదింపు తప్పనిసరి అవుతుంది. మూడ్ డిజార్డర్ వలన మెదడు లోపల మనసు రూపొందటానికి కారణమయ్యే రసాయనాల తూకంలో తేడాలు ఏర్పడతాయి. కాబట్టి దీర్ఘకాలం డిప్రెషన్ కొనసాగకుండా చూడాలి.
తీవ్రమైన చింతా శోక భయ దుఃఖాదులు వంశపారంపర్యంగా కూడా కలగవచ్చని, అవి పైన మనం చెప్పుకున్నట్టు, కోపం, నిరాశ, నెగెటివ్ భావోద్వేగాలకు దారి తీస్తాయి. అవి, తాను ఎలా ఉండాలని, ఎలా జీవించాలని కోరుకున్నాడో ఆ దారిని తప్పించి, వ్యక్తిని వెనక్కి మళ్ళిస్తాయి. నెగెటివ్ ఆలోచన తిరోగమనానికే దారి తీస్తుందెప్పుడూ! ఈ నెగెటివ్ ధోరణి వలనే ఆల్కహాలు, మాదకద్రవ్యాలకు లోను కావటం అనేవి జరుగుతుంటాయి. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రచురించిన Diagnostic and Statistical Manual of Mental Disorders (DSM) పుస్తకంలో ఈ చికిత్స అవసరమైన డిప్రెషను గురించి వైద్యులకే కాకుండా సామాన్యులకూ అవసరమైన కొన్ని సూచనలు ఉన్నాయి.
ఆందోళనకు లోనైన వ్యక్తి చిరాకు పడటం, దేనికీ సంతోషం ప్రకటించలేకపోవటం, బరువు తగ్గిపోవటం లేదా స్థూలకాయం, అమిత ఆకలి లేదా పూర్తిగా ఆకలి చచ్చిపోవటం, నిద్రపట్టకపోవటం లేదా అమితంగా నిద్రలోకి జారిపోవటం, పనితీరు మందగించటం, అలసిపోవటం,శక్తి-ఆసక్తి లేకపోవటం, ఇక్క తను జీవించటం అనవసరం అనీ, తన వల్ల ఏమీ కాదనీ భావించటం, చావు, ఆత్మహత్యల గురించి ఆలోచించటం, భ్రమలు (delusions), భ్రాంతులు(hallucinations) ఇలాంటివన్నీ అధికమోతాదుల్లో చికిత్సాపరమైన డిప్రెషన్ వ్యాధిలో కనిపిస్తాయి. తాత్కాలికంగా సందర్భవశాత్తూ వచ్చే డిప్రెషన్లో ఇన్ని లక్షణాలు ఉండవు. అంత తీవ్రంగానూ ఉండవు
వీటిలో ఏ ఐదు లక్షణాలు 2 వారాలకు మించి, రోజంతా ఉంటున్నట్టు కనిపించినా వెంటనే వైద్య సహాయం అందించటం అవసరం. గొప్ప పనిమంతులైన, సమర్ధత కలిగిన, ప్రతిభావంతులైన వ్యక్తులు కూడా తమ అతి సున్నితతత్వం వలన ఒక్కోసారి ఇలాంటి తీవ్ర చింతశోకాలకు లోనైతే కలిగే నష్టం అపారంగా ఉంటుంది. ఎవరికి వారు తాము త్వరగా తిప్పుకొని కోలుకోవటానికి (రికవరీ) ప్రయత్నించకపోతే ఈ పరిస్థితి వస్తుంది.
సందర్భ వశాత్తూ కలిగే దిగులు, అందోళనల్లో సహానుభూతి అనేది మంత్రంలా పనిచేస్తుంది. వారికి కలిగిన బాధ తన బాధగా భావించి, అనునయించి వారిని బయటకు లాగే ప్రయత్నం ఆత్మీయులైన ఇతరులు చేయటం మానవ ధర్మం.
వ్యాయామం, ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవటం, నిద్ర చెడకుండా జాగ్రత్తలు తీసుకోవటం, సన్నిహితులతోనూ, ఆత్మీయులతోనూ గడపటం, మనసుకు సంతోషాన్ని కలిగించే అంసాలమీదకు మళ్ళటం ఇలాంటివి త్వరగా విషాదంలోంచి వ్యక్తుల్ని బయట పడేస్తాయి. వ్యక్తులు కూడా ఆ పరిస్థితికి తగ్గట్టుగా తిప్పుకుని, ఆందోళన లోంచి బయటపడటానికి ప్రయత్నించాలి! అవసరమైతే వైద్యుని సంప్రదించి దిగులు తగ్గించే ఔషధ సహాయం తీసుకోవచ్చు. తీవ్రమైన దిగులు దీర్ఘకాలంగా ఉన్నప్పుడు వైద్యుని సలహా తప్పనిసరి అవుతుంది.
ఆయుర్వేదంలో మనోబలాన్ని పెంపొందింప చేసే ఔషధాలు అనేకం ఉన్నాయి. అనుభవం కలిగిన వైద్యుని ద్వారా దీనికి మంచి చికిత్స పొందవచ్చు.

No comments