Friday, December 23, 2016

పురస్కారం--వెంకట్ గుడిపాటి

పురస్కారం ఒక ప్రోత్సాహం, ఒక గుర్తింపు, చేసిన కృషి పట్ల చూపే గౌరవం. సృజనాత్మక రంగాలలో ఉన్నత ప్రమాణాలు పాదుకొల్పినవారికి అందించే సత్కారం. ... thumbnail 1 summary

పురస్కారం ఒక ప్రోత్సాహం, ఒక గుర్తింపు, చేసిన కృషి పట్ల చూపే గౌరవం. సృజనాత్మక రంగాలలో ఉన్నత ప్రమాణాలు పాదుకొల్పినవారికి అందించే సత్కారం. ఆయా రచనల, సినిమాల, కళాఖండాల ఉన్నతికి తోడ్పడటం పురస్కారాల లక్ష్యం. ఒక పుస్తకానికి పురస్కారం వచ్చిందంటే దానిపట్ల ఆసక్తి, ఉత్సుకత ఇనుమడించాలి. ఒక సినిమాకు పురస్కారం ప్రకటిస్తే ప్రేక్షకుల సంఖ్య పెరగాలి. కానీ ఇందుకు భిన్నమైన స్పందనల్ని చూస్తున్నాం. అవార్డు సినిమాలంటే ఆదరణ చూపేవారు స్వల్పం. అవార్డు లభించిన పుస్తకాలపై ఆసక్తి అంతంత మాత్రమే.
అవార్డు మాత్రమే ప్రమాణాలకు, ఆదరణకు కొలమానం కాదు. అవార్డు వచ్చినవారంతా ఆనందంతో పొంగిపోరు. అవార్డుస్థాయిని మించి తమ ప్రతిభాసంపత్తులతో వెలుగొందే వారు అవార్డుల్ని సాధారణమైన వాటిగా పరిగణిస్తారు. ఈ ఏడాది నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీత బాబ్‌డిలాన్‌ వైఖరి ఇందుకు తార్కాణం. తనకు నోబెల్‌ బహుమతి ప్రకటించడం పట్ల చాన్నాళ్ళపాటు స్పందించలేదాయన. ఈనెల పదో తేదీన జరగనున్న నోబెల్‌ పురస్కారాల ప్రదానోత్సవ సభకు కూడా హాజరు కావడం లేదు. ఇప్పటికే నిర్దేశించుకున్న కార్యక్రమాల కారణంగా తాను హాజరు కాలేకపోతున్నట్టు ప్రకటించారు. అసలు సిసలు సృజనశీలి బాబ్‌డిలాన్‌ స్పందన ఆహ్వానించదగిన పరిణామం.
నోబెల్‌ పురస్కారం ఘనమైనదేం కాదు. అందులోనూ అనేక రాజకీయాలున్నాయి. జీన్‌పాల్‌ సార్త్రే లాంటి మేధావులు ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. యుద్ధోన్మాదాన్ని వదులుకోని అమెరికా దేశాధ్యక్షుడయిన ఒబామాకు శాంతి బహుమతినివ్వడం ఒక అభాస. ఏ ఉద్దేశాలు, విలువలకు ప్రాతినిధ్యం వహించాలో అందుకు విరుద్ధమైన వారికి నోబెల్‌ బహుమతులు ప్రకటించడం కొత్తేం కాదు. నోబెల్‌ పురస్కారాలపై తిరస్కారభావాలకు ఇదే మూలం.
ఏ అవార్డు అయినా దాని స్ఫూర్తికి విరుద్ధమైన వారికి ఇవ్వడం అసమంజసం. 'మతములన్నియు మాసిపోవును... జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును' అన్న గురజాడ పేరుతో ఉన్న అవార్డును, ఆయన భావజాలానికి విరుద్ధంగానూ, హిందూత్వను ప్రోత్సహించే వారికి ఇవ్వడం అనౌచిత్యం, అసంగతం. అది గురజాడకే అపచారం. ఈ పురస్కార ప్రహసనం పట్ల ఉత్తరాంధ్ర రచయితలు, కవులు, జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.
తెలుగునాట పురస్కారాలపై మిశ్రమ భావాలు నెలకొన్నాయి. ఒకదశలో ప్రభుత్వ పురస్కారాల్ని వద్దన్నవారు, తిరిగి వాటిని స్వీకరించిన ఉదంతాలున్నాయి. ఇస్తున్నది ప్రభుత్వం కాదు, అకాడమీ లేదా యూనివర్సిటీ అన్నారు. కానీ వాటికి నిధుల్ని సమకూర్చేది ప్రభుత్వమేనన్నది వాస్తవం. కొన్నాళ్ళ కిందట సృజనాత్మక రంగాల్లోని వారిపై జరుగుతున్న దాడులకు నిరసనగా అవార్డుల్ని వెనక్కి ఇస్తున్నట్టు అనేకమంది ప్రకటించారు. ఈ చర్యని సమర్థించినవారు ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల్ని తీసుకుంటున్నవారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల పాలనే సాగుతున్నది. ఈ పాలన వల్ల బాధలు పడే ప్రజలు పోరాడుతూనే వున్నారు. ఆ ప్రజలకీ, వారి పోరాటాలకీ సంఘీభావంగా రచనలు చేసే రచయితల చిత్తశుద్ధిని శంకించలేం. అయితే అవార్డులపై నిర్దిష్ట వైఖరితో ఉండాలి. ద్వంద్వ ప్రమాణాలతో కూడిన వ్యవహారసరళి వారి వ్యక్తిత్వాన్ని పలుచన చేస్తుంది.
నిజానికి తెలుగు సమాజంలో పురస్కారాల ప్రహసనం ఎప్పుడూ వివాదాస్పదమే. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఇచ్చే అవార్డులు అనేకం. ఎవరు ఎవరికి అవార్డు ప్రకటించినా, అభినందించే వారు తక్కువ. 'అవార్డు ఎలా వచ్చింది' అని చెవులు కొరుక్కునే వారు ఎక్కువ. అంతేగాక అవార్డుల కారణంగా పుస్తకాల ప్రాశస్త్యం, విలువ ఇనుమడించిన సందర్భాలు చాలా అరుదు.
అవార్డుతో సంబంధం లేకుండానే ఆయా వ్యక్తుల రచనలు నిలిచి వెలుగుతున్నాయి. ఏ అవార్డు పొందని రచయిత చలం. దశాబ్దాలుగా చలం పుస్తకాలు చదువుతున్నారు. బెంగాలీ రచయిత శరత్‌ బెంగాలీలకే కాదు, భారతీయులందరికీ ఇష్టుడు. అవార్డులతో సంబంధం లేకుండా ఆయన రచనలు చూపిన ప్రభావం అపారం. అవార్డు రానప్పటికీ ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ రచన 'అన్‌టచ్‌బుల్‌' ప్రభావం అమేయం.
తమ పుస్తకానికి అవార్డు రావడం సరే, దాని ప్రభావమెంత అని కవులు, రచయితలు ఆలోచించాలి. ఒక రచనని ఎంతమంది చదివారు, ఎందరు గుర్తుపెట్టుకున్నారు, ఎందరిని ఊగించి శాసించిందన్నది ప్రధానం. ఈ కోణంలోంచి చూస్తే 'ఘనమైన' అవార్డులు పొందిన రచనలు సైతం జాడలేకుండా పోయిన వైనం తెలిసిందే. పైరవీల, రాజకీయాల కారణంగా అవార్డులు దక్కించుకున్న నాసిరకం రచనలు కాలం తాకిడికి నిలబడలేవు.
పురస్కారం ఒక రచనకు అలంకారం కావాలి. అలాగే పురస్కారస్థాయిని పెంచే ఉదాత్తత రచనకు ఉండాలి. వ్యక్తులయినా, సంస్థలయినా ఇచ్చే అవార్డులు ఈ ప్రమాణాలు పాటించాలి. గురజాడ, శ్రీశ్రీ, చాసో, రావిశాస్త్రి మొదలయిన ప్రముఖుల పేర్లతో ఇస్తున్న పురస్కారాలు వారి భావజాలాలకు, రచనా విలువలకు ఎంత దగ్గరగా వున్నాయన్నది ప్రశ్నార్థకం. కనీసం తాము నిర్దేశించుకున్న సూత్రాలని, ప్రమాణాలని పాటించినప్పుడే ఆయా పురస్కారాలకు గౌరవం లభిస్తుంది. 'ఉత్తమ గ్రంథం' అనే మాటని అక్షరాలా పాటించినట్టయితే పురస్కారానికి వన్నె చేకూరుతుంది. పురస్కార గ్రంథం కనుక చదివి తీరాలన్న ఆసక్తినీ, అనురక్తినీ ప్రోది చేస్తుంది. అప్పుడే పురస్కారం లక్ష్యం నెరవేరుతుంది.

No comments